హైదరాబాద్, సెప్టెంబర్ 24 (జనవాణి): తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చర్యలు వేగవంతం చేస్తోంది. సహాయ ఆచార్యులు/అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన మొత్తం 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో కొన్ని నిబంధనలు, అర్హతల్లో మార్పులు చేయనున్నారు.
2013 తర్వాత మళ్లీ భర్తీ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో భర్తీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 491 అధ్యాపకులు, 24 లైబ్రేరియన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు కలిపి 544 ఖాళీల భర్తీకి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే యూజీసీ నిబంధనలు, ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలపై అభ్యంతరాలు రావడంతో ఆ నియామక ప్రక్రియ నిలిచిపోయింది.
ఎంపిక విధానంలో మార్పులు
గత నోటిఫికేషన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న జీఓ-4 జారీ చేయడంతో ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు.
కొత్త విధానం ప్రకారం..
అకడమిక్ ప్రతిభ – 50 మార్కులు
రాత పరీక్ష – 40 మార్కులు
ఇంటర్వ్యూ – 10 మార్కులు
చొప్పున మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. కొత్త జీఓకు అనుగుణంగా పోస్టుల వారీగా అర్హతలు, ఎంపిక నిబంధనలను నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు.
పెరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య
రాష్ట్రంలో మూడేళ్ల క్రితం 132గా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య ప్రస్తుతం 150కి పెరిగింది. వీటిలో అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు కలిపి 4,098 మంజూరు పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 1,500 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 2,000 మంది అతిథి అధ్యాపకులు, 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత కొనసాగుతోంది.
మరో 1,000 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధనా సిబ్బంది అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 1,000 ఖాళీల భర్తీకి కళాశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం వీటికి ఆమోదం తెలిపితే, వాటి భర్తీకి ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆర్థికశాఖ అనుమతి ఉన్న 544 పోస్టుల భర్తీకి ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీజీపీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలపై పూర్తి స్పష్టత రానుంది.




















