హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలక అప్‌డేట్. 7,437 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పోలీస్ నియామక మండలి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 9తో ముగియాల్సి ఉండగా.. తాజాగా మరో వారం రోజులపాటు గడువు పెంచింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు అప్లికేషన్ సమర్పించని వారికి మరో అవకాశం లభించింది.
ఈ నియామక ప్రక్రియలో మొత్తం 7,437 పోస్టులు ఉన్నాయి. ఇందులో 7,112 కానిస్టేబుల్ పోస్టులు, 275 ఎస్సై పోస్టులు ఉండగా.. ఏఎస్‌ఐ, పీసీ డ్రైవర్స్, మెకానిక్ తదితర పోస్టులు కూడా ఉన్నాయి.
భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ నియామకాలకు నిరుద్యోగులు, ఉద్యోగార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగింపు అభ్యర్థులకు ప్రయోజనకరంగా మారింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ అదనపు గడువును వినియోగించుకుని అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.




















