సిద్దిపేట, ఆగస్టు 3: తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్ ద్వారా జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన నర్సులు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్‌కామ్ సంస్థ ఎథికల్ రిక్రూట్‌మెంట్ సంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. తెలంగాణలోని గుర్తింపు పొందిన కళాశాలల నుంచి జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హతలు ఇవే
దరఖాస్తుదారులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి.
వయసు 22 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
తెలంగాణలో గుర్తింపు పొందిన కాలేజీల్లో జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి కనీసం ఒకటి నుంచి మూడు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉండాలి.
ఇండియన్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వృద్ధుల సంరక్షణ, పాలియేటివ్ కేర్, ఐసీయూ, కార్డియాలజీ, జనరల్ మెడికల్, సర్జికల్ వార్డులు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, నియోనేటల్, ఆపరేషన్ థియేటర్, సైకియాట్రీ తదితర విభాగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఇప్పటికే బీ1 లేదా బీ2 స్థాయి జర్మన్ భాషా పరిజ్ఞానం ఉన్నవారిని ఫాస్ట్‌ట్రాక్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపిక చేస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు గుర్తింపు దశలో నెలకు 2,300 నుంచి 2,700 యూరోలు, జర్మన్ లైసెన్స్ పొందిన తర్వాత నెలకు 2,800 నుంచి 3,000 యూరోలు వేతనం అందుతుందని సిద్దిపేట కలెక్టర్ తెలిపారు. పూర్తి ఆరోగ్య బీమా, జర్మనీలో శాశ్వత నివాస అనుమతి పొందే అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు.
అలాగే టామ్‌కామ్ ఆధ్వర్యంలో ఏ1 నుంచి బీ1/బీ2 స్థాయి వరకు జర్మన్ భాషా శిక్షణ, డాక్యుమెంట్ ప్రాసెసింగ్, వీసా మార్గదర్శకత్వం, విదేశీ నియామకం వరకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఆగస్టు 10లోగా దరఖాస్తు
అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాను ఆగస్టు 10వ తేదీలోగా germanytriplewin2025@gmail.comకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440049645, 9440052081, 9440051581 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ హైమావతి తెలిపారు.





















