హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2,278.14 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
2,009 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో 1,609.23 ఎకరాలను భారత వైమానిక దళం (IAF) అవసరాలకు, మరో 400 ఎకరాలను సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాలకు కేటాయించనున్నట్లు తెలిపారు.
మౌలిక వసతుల మార్పిడికి కూడా నిధులు
భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మార్పు, మిషన్ భగీరథ పైప్‌లైన్ల మార్పిడి, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా పరిపాలనా అనుమతుల్లో చేర్చినట్లు మంత్రి తెలిపారు.
ఉత్తర తెలంగాణకు భారీ ఊతం
భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక రంగం, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
డిసెంబర్ 31 నాటికి కీలక పనులు పూర్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్
ప్రాంతీయ సమతుల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ పూర్తయితే ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి పోసే గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.




















