జడ్చర్ల, ఆగస్టు 27 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మహిళలను తాను ఎంతో గౌరవిస్తానని, వారి గురించి బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలు తనను తిట్టినా వాటిని ఆశీర్వాదాలుగానే భావిస్తానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లి మందలించినా ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పారు. మహిళ కన్నీళ్లను తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొంటూ.. “మహిళ కన్నీటి ఒక్క చుక్క నేలపై పడినా అది సునామీగా మారుతుంది. ఆ సునామీలో మనమే కొట్టుకుపోతాం” అంటూ వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
కొండా సురేఖ వ్యవహారంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని సూచించారని అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఏఐసీసీ, పీసీసీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవించి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారనేది దేవుడికి తెలుసని పేర్కొన్న ఆయన.. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా దానిని గౌరవిస్తానని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారంపై ఇక మరింతగా స్పందించబోనన్న సంకేతాలను ఇచ్చారు.
జడ్చర్ల అభివృద్ధిపై మాత్రం వెనక్కి తగ్గేది లేదు
మరోవైపు జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం తన పోరాటం కొనసాగుతుందని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు అవసరమైతే మంత్రులను కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతానని చెప్పారు. నిధులు విడుదల కాకపోతే దీక్షకు కూడా కూర్చుంటానని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన బాధ్యత అని అనిరుధ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రజలకు ప్రశ్నించే హక్కును కల్పించిందని, జడ్చర్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
మొత్తంగా కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ క్రమశిక్షణను గౌరవిస్తూ సంయమనం పాటిస్తానని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. జడ్చర్ల అభివృద్ధి, ప్రజా సమస్యల విషయంలో మాత్రం అవసరమైతే ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తానని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Loading Tweet...




















