హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం.. వాటి నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్‌లో వేలాది ఆలయాలు ఉన్నాయని, బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు కేటాయించి.. రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బోనాల సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందూ సమాజం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం పట్టుకుందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ మాత్రం మైనారిటీ సంతుష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు కడుపు మంటగా ఉందని వ్యాఖ్యానించారు.
హిందువుల సమస్యలపై తాను నిరంతరం ప్రశ్నిస్తానని బండి సంజయ్ అన్నారు. గోమాతను వధించినా, హిందూ ఆలయాలను ధ్వంసం చేసినా ప్రశ్నించాలన్నారు. సనాతన ధర్మం కోసం తాను పనిచేస్తానని, హిందువులంతా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. యువత, ముఖ్యంగా జెన్-జీ నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. సనాతన ధర్మం కోసం జెన్-జీ యువత మాట్లాడుతున్న తీరు తనకు ముచ్చట కలిగిస్తోందని చెప్పారు.
నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విమర్శలు
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా 150 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తే సరూర్‌నగర్ స్టేడియం అభ్యర్థులతో నిండిపోవడమే పరిస్థితికి నిదర్శనమన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రోజ్‌గార్ మేళా ద్వారా 12 లక్షల ఉద్యోగాలను అందించిన ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా ఎంతమంది మహిళలకు రూ.2,500 అందిస్తున్నారని ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అర్హులైన వృద్ధుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు.
బోనాల ఉత్సవాలకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను ఏటా బోనాల ఉత్సవాలకు వస్తున్నానని తెలిపారు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదని, రాజకీయ పార్టీ అని పేర్కొంటూ.. అభివృద్ధి, ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో హిందూ సమాజం, తెలంగాణ సమాజం మరింత జాగృతం కాబోతోందని అన్నారు.





















