వరంగల్,సెప్టెంబర్ 04 (జనవాణి): వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సారయ్య తీవ్రంగా స్పందించారు. సురేఖకు ధైర్యముంటే తనపై ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
‘ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం’
ధైర్యముంటే రండి.. ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. మీరు ఇండిపెండెంట్‌గా, నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం. మీరు ఒక్క పైసా ఖర్చు చేయొద్దు.. నేను కూడా ఒక్క పైసా ఖర్చు చేయను అంటూ సారయ్య సవాల్ చేశారు. వ్యక్తిగతంగా తనను విమర్శించినందునే ఈ సవాల్ చేస్తున్నానని తెలిపారు.
బీసీ అంశంపై కూడా సురేఖపై సారయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ కుటుంబమే బీసీనా? ఇంకెవరూ లేరా? అంటూ ప్రశ్నించారు. పదవులు దక్కినప్పుడే బీసీల గురించి మాట్లాడటం సరైన విధానం కాదని విమర్శించారు.
రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయొద్దు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మరోసారి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని సారయ్య హెచ్చరించారు. రేవంత్‌రెడ్డిపై మాట్లాడే ముందు అన్ని విషయాలను ఆలోచించుకోవాలని హితవు పలికారు. లేదంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు.
‘నీ భార్య కూడా ఓటు వేయదు’ వ్యాఖ్యలపై రగడ
ఇటీవల బస్వరాజు సారయ్యను ఉద్దేశించి 'నీ భార్య కూడా నీకు ఓటు వేయదు' అంటూ కొండా సురేఖ చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సారయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. కొండా సురేఖపై ఫిర్యాదు చేసింది తానేనని పేర్కొంటూ, గతంలో 250 మూగజీవాలను కాల్చిన ఘటనపై కూడా ప్రశ్నలు సంధించారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో సారయ్య, కొండా కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా సురేఖ బర్తరఫ్ వ్యవహారం, ఆ తర్వాత ఇరువర్గాల మధ్య చోటుచేసుకుంటున్న బహిరంగ విమర్శలు ఈ విభేదాలను మరింత తీవ్రం చేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.




















