కొత్తగూడెం : తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా రేర్ ఎర్త్ మినరల్స్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల రంగంలోకి విస్తరించాలని సూచించారు.
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి, జెన్‌కో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశముందని భట్టి అన్నారు. సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వినియోగం పెరగడంతో థర్మల్ విద్యుత్, బొగ్గుపై ఆధారపడటం క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని సింగరేణి ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని, సెమీకండక్టర్లు, మైక్రోచిప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, అధునాతన సాంకేతిక పరిశ్రమలకు ఇవి అత్యంత కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కీలక ఖనిజ గనుల వేలంలో సింగరేణి పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణికి దశాబ్దాల అనుభవం కలిగిన ఇంజినీర్లు, మైనింగ్ నిపుణులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ ప్రమాణాల మైనింగ్ ప్రాజెక్టుల్లో వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
బొగ్గు నాణ్యతపై రాజీ వద్దు
ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలంటే బొగ్గు నాణ్యత, సామర్థ్యం, సేవల్లో మెరుగుదల తప్పనిసరని భట్టి స్పష్టం చేశారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కోల్ వాషరీలను సమర్థవంతంగా నిర్వహించాలని, వివిధ గ్రేడ్‌ల బొగ్గును శాస్త్రీయంగా బ్లెండ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని భట్టి ఆరోపించారు. బొగ్గు బ్లాక్‌ల వేలంలో సమర్థవంతంగా పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొత్త బొగ్గు వనరులను కోల్పోయిందన్నారు. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు బ్లాక్‌లను సకాలంలో కేటాయించుకునేలా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడిశాలోని నైని బ్లాక్, తాడిచెర్ల–2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.
ఉద్యోగుల భాగస్వామ్యంతో 10 ఏళ్ల రోడ్‌మ్యాప్
సింగరేణి కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, వేలాది కార్మిక కుటుంబాల జీవనాధారమని భట్టి పేర్కొన్నారు. సంస్థ లాభదాయకంగా ఉంటేనే ఉద్యోగుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని అన్నారు.
ప్రతి గనిలో యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి ఉద్యోగులతో బహిరంగ చర్చలు నిర్వహించి, సంస్థ భవిష్యత్తుపై వారి సూచనలు తీసుకుని సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
అలాగే భవిష్యత్ బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, సింగరేణి విస్తరణ వ్యూహం, 10 ఏళ్ల అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై దృష్టి సారించాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల తరహాలో లక్ష్యాలు, గడువులు నిర్ణయించి వాటి అమలుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్. బలరాం (జ్యోతి బుద్ధ ప్రకాశ్), జెన్‌కో, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




















