హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆయన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదే సమయంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును బీఆర్ఎస్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం రానున్న నెలల్లో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రాథమికంగా ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని దానం నాగేందర్ ఇటీవల బహిరంగంగా పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది.
ఇక బీజేపీ నుంచి గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చింతల రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై అధికారిక ప్రకటనల కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.




















