న్యూఢిల్లీ, ఆగస్టు 4: విమాన ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, ప్రయాణికులతో విమాన సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
విమానాలు, ప్రయాణికులు, ఆస్తుల భద్రతను నిర్ధారించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేస్తోందని మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. విమానాల్లో క్రమశిక్షణను పాటించేలా, ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా, అవాంఛనీయ లేదా అల్లరి ప్రవర్తనను అరికట్టేందుకు 'హ్యాండ్లింగ్ ఆఫ్ అన్‌రూలీ అండ్ డిస్‌రప్టివ్ ప్యాసింజర్స్' పేరుతో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రయాణికుల కోసం క్యాబిన్ సేఫ్టీ సర్క్యులర్-01/2016 ప్రకారం మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు 24 గంటల 'ప్యాసింజర్ అసిస్టెన్స్' కంట్రోల్ రూమ్ పనిచేస్తోందని తెలిపారు. విమానాల రాకపోకలు, సామాన్ల భద్రత, లగేజీ ఆలస్యం, రీఫండ్‌లకు సంబంధించిన అంశాలను డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
అదనంగా ప్రయాణికుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయని మంత్రి మురళీధర్ మొహోల్ తన సమాధానంలో పేర్కొన్నారు.





















