ఖమ్మం: ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ గౌడ్‌కు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎంపీ తరఫున బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజ్ గురువారం వేణుకుమార్, ఆయన తండ్రి భద్రయ్యకు నగదు అందజేశారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఈ నెల 1న ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. కోలుకున్న అనంతరం ఇటీవల ఇంటికి చేరుకున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ విచారం వ్యక్తం చేసి, తన వంతు సాయంగా రూ. లక్ష పంపించారు. ఈ సందర్భంగా లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాల వల్ల యువత తీవ్ర నిరాశకు గురవుతోందని విమర్శించారు.





















