జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలు కేవలం ప్రతీకలు కాదని, భారత సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు అవి ప్రతిరూపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాజ్యసభలో 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, జాతీయ చిహ్నాల పరిరక్షణకు చట్టాలను కాలానుగుణంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలు కేవలం ప్రతీకలు కాదని, భారత సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు అవి ప్రతిరూపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాజ్యసభలో బుధవారం జరిగిన 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'పై చర్చ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు.
దేశ గౌరవం అంటే కేవలం జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన కోట్లాది మంది అమరవీరుల త్యాగాలకు అవి ప్రతీకలని వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
త్రివర్ణ పతాకం మహనీయుల ఆశయాల ప్రతీక
భారత త్రివర్ణ పతాకం సాధారణ వస్త్రం కాదని, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి మహనీయుల ఆశయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. జాతీయ పతాకంలోని ప్రతి రంగు దేశ రాజ్యాంగ విలువలను, ఆదర్శాలను ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.
డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలు మారాలి
1971లో రూపొందించిన చట్టం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉందని, అయితే ప్రస్తుతం సోషల్ మీడియా, కృత్రిమ మేధ (AI), డిజిటల్ వేదికల విస్తరణతో జాతీయ చిహ్నాల అవమానకర వినియోగం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడిందని రవిచంద్ర తెలిపారు. అందుకే కాలానుగుణంగా చట్టాలను బలోపేతం చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.
భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు
ఈ సవరణ భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించినప్పటికీ, ఆర్టికల్ 19(2) దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజా శాంతి పరిరక్షణ కోసం తగిన పరిమితులను అనుమతిస్తుందని వివరించారు.
ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో హక్కు అయినప్పటికీ, దేశ గౌరవాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అవగాహన పెంచాలి
జాతీయ చిహ్నాలను అవమానించే వారిపై శిక్షలు కఠినతరం చేయడమే కాకుండా, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థల్లో జాతీయ జెండా, జాతీయ గీతం పట్ల గౌరవ భావన పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు శిక్షకు భయపడి కాకుండా భారతీయులమనే గర్వంతో జాతీయ చిహ్నాలను గౌరవించే పరిస్థితి రావాలని అన్నారు.
పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయం
భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసిన రవిచంద్ర, ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఎగురుతుండటం భారత స్వాతంత్ర్యానికి మాత్రమే కాకుండా పింగళి వెంకయ్య దూరదృష్టి, దేశభక్తికి కూడా ప్రతీక అని కొనియాడారు.
బీసీలకు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
దేశ నిర్మాణంలో, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, రక్షణ తదితర రంగాల్లో వెనుకబడిన తరగతుల (బీసీలు) పాత్ర కీలకమని ఎంపీ పేర్కొన్నారు. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నట్లే, జనాభాలో అత్యధికులైన బీసీల కోసం కూడా ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని 'జాతీయ గౌరవానికి అవమానం నిరోధక (సవరణ) బిల్లు-2026'కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో వెల్లడించారు.




















