హైదరాబాద్, ఆగస్టు 21 (జనవాణి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన నేతృత్వంలోని అధికారిక తెలంగాణ బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం బుధవారం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచే విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి.. ఆగస్టు 23న అమెరికా వెళ్లి, ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఈ షెడ్యూల్ మారిపోయింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజకీయ కారణాలతో అనుమతి ఇవ్వలేదని సీఎంఓ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి ఆగస్టు 23న లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటన రద్దు కావడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
రాజకీయంగా ఆసక్తికర పరిణామం
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి గళాలు వినిపిస్తున్న సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఈ మార్పు చోటుచేసుకోవడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు కారణమవుతోంది.




















