న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పీఎంఏవై-జీ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల గ్రామీణ గృహాలను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని ఆయన వివరించినట్లు తెలిపారు.
వీబీ-జీ రామ్-జీలో అదనపు పనుల ప్రతిపాదన
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీబీ-జీ రామ్-జీ కార్యక్రమంలో అదనపు పనులను చేర్చాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేలా 10 కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
రైతులకు మరిన్ని అవకాశాలు
కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు వంటి పనులను కార్యక్రమంలో చేర్చాలని సీఎం ప్రతిపాదించారు. అలాగే రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ అనుసంధానం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వీబీ-జీ రామ్-జీ పనుల జాబితాలో చేర్చి, లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.




















