హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏకకాలంలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పొందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.





















