ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కోచింగ్ మాఫియా? హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించిన ఆయన, గతంలో గ్లోబరీనా వంటి సంస్థలపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ అక్రమాలు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించాయని విమర్శించారు.

28 జులై, 2026 6:08 PM•ByLaharika

Share this article

ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కోచింగ్ మాఫియా? హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

విద్యా వ్యవస్థలో ప్రశ్నపత్రాల లీకేజీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హైడ్రా చర్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉండవని, ఆఫ్‌లైన్ పరీక్షల సమయంలోనే ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

కోచింగ్ సెంటర్లపై జాతీయ విధానం అవసరం

దేశవ్యాప్తంగా అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయని సీఎం విమర్శించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో కేంద్రం ఆధిపత్యం ప్రదర్శించకుండా, విద్యను సాధ్యమైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని సూచించారు.

గ్లోబరీనా వ్యవహారంపై విమర్శలు

గ్లోబరీనా వంటి సంస్థలు గతంలో అక్రమాలకు పాల్పడినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అవి సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి గందరగోళానికి కారణమయ్యాయని సీఎం ఆరోపించారు. ఇలాంటి సంస్థల విషయంలో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పనులపై చర్చ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ఉపాధి పనులకు సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం తెలిపారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ఆయనను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు మిగిల్చిందని సీఎం ఆరోపించారు. సరైన వసతులు లేకుండా తప్పుడు లెక్కలతో నిధులు పొందేందుకు ప్రయత్నించిన విద్యాసంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంస్థలకు బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.

ఇకపై ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని అదే ఏడాదిలో చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల వరకు ఈ పథకానికి అవసరమవుతాయని, భవిష్యత్తులో ఈ సమస్య ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదు

హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక సంస్కరణల్లో ఒకటని సీఎం పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులను కాపాడటం హైడ్రా ప్రధాన బాధ్యత అని చెప్పారు. హైడ్రా చర్యలను అడ్డుకునేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వానికి తన విధానంపై పూర్తి స్పష్టత ఉందన్నారు.

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, వాటిని సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్న సీఎం, ప్రభుత్వ భూములు, జలవనరుల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు