తెలంగాణలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హులైన ప్రతి బాధితుడికి సామాజిక భద్రతా పింఛన్ మంజూరు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పింఛన్లను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని సూచించారు.
గురువారం మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.
అందరు అర్హులకు పింఛన్లు
వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులందరికీ అర్హత మేరకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎం సూచించారు. అలాగే దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు ఆలస్యం లేకుండా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీడీవోలకు కీలక బాధ్యతలు
మండల స్థాయిలో వివిధ శాఖలు చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు సమన్వయం చేసి పర్యవేక్షించే విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి, వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని పేర్కొన్నారు. దీంతో గ్రామాల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.
ప్రతి గ్రామానికి తారు రోడ్డు
రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామ పంచాయతీకి కార్యాలయ భవనం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి భవనాలు నిర్మించాలని సూచించారు.
ఇందిరమ్మ చీరల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
కోటి మంది మహిళలకు పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరలు నాణ్యతలో, డిజైన్లలో ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. డిజైన్ల రూపకల్పనలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల నుంచి మంచి స్పందన లభిస్తున్నందున నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
తాగునీటికి తొలి ప్రాధాన్యం
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్, సాగునీటి శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. తాగునీటి పథకాల కింద పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని, స్థానిక నీటి వనరులను ఆధారంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు.




















