హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు.
నిరంకుశ పాలనపై పోరాడిన యోధులకు తెలంగాణ పుట్టినిల్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజాచైతన్యాన్ని రగిలించిందని పేర్కొన్నారు. సుదీర్ఘ తెలంగాణ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచస్థాయి గుర్తింపు సాధించినప్పటికీ.. అదే సమయంలో దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతలు పెరిగాయని సీఎం గుర్తుచేశారు. పాలన చివరి దశలో రజాకారుల దౌర్జన్యాలు మరింత తీవ్రమయ్యాయని తెలిపారు.
1948 సెప్టెంబర్ 17న సైనిక చర్యతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడటమేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.




















