హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): ధాన్యం బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో బుధవారం సివిల్ సప్లయిస్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
బకాయిల వసూళ్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. బకాయిల వసూళ్లకు ప్రాధాన్యం ఇస్తూ స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైస్ మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను ఎంతమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల బకాయిల వసూళ్లతో పాటు మహిళా సంఘాలకు ఆర్థికంగా మరిన్ని అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం నిల్వలకు అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం అధికంగా దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. గోడౌన్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మహిళా సంఘాలకు ఆర్థిక కార్యకలాపాల్లో మరింత భాగస్వామ్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
సివిల్ సప్లయిస్ శాఖ పరిధిలోని వివిధ అంశాలపై జిల్లా స్థాయిలో సమన్వయం పెంచేందుకు ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్, నిల్వలు, బకాయిల వసూళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.





















