సిరిసిల్ల,సెప్టెంబర్ 30 (జనవాణి): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారిందని ఆరోపించారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని పెద్దలు చెబుతుంటారని, అయితే బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం కార్మికుల కన్నీళ్లు, మగ్గాల చప్పుళ్లు, సంఘాల ఆందోళనలకు నిలయంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పరిస్థితి మారిపోయిందని చెప్పడం కంటే మార్చేశారని చెప్పడం సరిగ్గా ఉంటుందని వ్యాఖ్యానించారు.
చేనేతకు చిరునామా సిరిసిల్ల
మానవ నాగరికతలో వస్త్రానికి ఎంతో కీలక స్థానం ఉందని సీఎం అన్నారు. వస్త్రాలు ధరించడం ప్రారంభించినప్పటి నుంచే మానవ నాగరికత ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అసలైన చిరునామా అని చెప్పారు. మగ్గాల నుంచి సాంచాల వరకు వేలాది కుటుంబాలు చేనేత పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నాయని, చేనేత కార్మికులు, చేతివృత్తులు, వృత్తి నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరని రేవంత్ రెడ్డి అన్నారు.
కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు
2009 ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామాన బలోపేతం చేసిన నాయకుల్లో కేకే మహేందర్ రెడ్డి, పాపారావు తదితరులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. ఆ సమయంలో పార్టీ టికెట్ కేకే మహేందర్ రెడ్డికి ఇచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండేదని అన్నారు. అయితే కేటీఆర్‌కు టికెట్ ఇవ్వడంతో స్వల్ప తేడాతో ఆయన విజయం సాధించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని సీఎం ఆరోపించారు. సిరిసిల్ల ఓటర్లను సొమ్ముగా మార్చుకున్నారని విమర్శించారు.
కార్మికుల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై ప్రశ్నలు
2009 నుంచి 2026 మధ్య సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌ను పలుమార్లు గెలిపించినప్పటికీ ఈ ప్రాంత కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల ఆత్మహత్యలను ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లారని సీఎం తెలిపారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. గల్ఫ్‌లో అనుకోని పరిస్థితుల్లో మరణించిన కార్మికుల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడంలోనూ అప్పటి ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.




















