నాణ్యమైన విద్యను అందించే దీక్షబూనండి.. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి

నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంత‌స్తుల్లాంటివ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామ‌నే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాల‌ని సూచించారు.

30 జులై, 2026 8:28 PM•ByRalin

Share this article

నాణ్యమైన విద్యను అందించే దీక్షబూనండి.. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి

టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫీ

హైద‌రాబాద్‌: నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంత‌స్తుల్లాంటివ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామ‌నే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాల‌ని సూచించారు. టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌” కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీహెచ్ఆర్డీలో గురువారం స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై స‌గ‌టున రూ.1.08 ల‌క్షలు ఖర్చు చేస్తున్నామ‌ని, దానిని వారి అభివృద్ధికి పెట్టే పెట్టుబ‌డిలా చూడాల‌న్నారు. అంత మొత్తం ఖ‌ర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాల‌న్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో కూడిన విద్యా వ్యవస్థ ఉండాల‌నే లక్ష్యంతోనే ఉపాధ్యాయుల‌ను విదేశీ ప‌ర్యట‌న‌ల‌కు పంపుతున్నామ‌ని తెలిపారు. ఆయా దేశాల్లో ప‌ర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయులు అక్కడి అనుభ‌వాల‌ను ఇక్కడ ఆచ‌ర‌ణ‌లో తీసుకురావాల‌ని సూచించారు. వివిధ దేశాల ప‌ర్యట‌న‌తో ప్రపంచం ఎటు వెళుతుందో తెలుస్తుంద‌ని.. ప‌ర్యట‌న‌తో తెలుసుకున్న అంశాల‌ను ఇక్కడ విద్యార్థుల‌కు బోధించి వారిని ప్రపంచంతో పోటీ ప‌డేలా తీర్చిదిద్దాల‌ని ఉపాధ్యాయుల‌కు సూచించారు.

ఆస్తులు లేక‌పోవ‌డం వెనుక‌బాటుత‌నం కాద‌ని, విద్య లేక‌పోవ‌డ‌మే వెనుక‌బాటుత‌న‌మ‌ని తాము నిర్వహించిన సామాజిక‌, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, కుల స‌ర్వే తేల్చింద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక‌రాల కొద్ది భూమి, ఇత‌ర ఆస్తులు ఉన్నా స‌మాజం ఎటు వెళుతుందో తెలియ‌క వెనుక‌బ‌డి పోతున్నార‌ని, ఏ ఆస్తులు లేక‌పోయినా చ‌దువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ ప‌డుతున్నార‌ని తెలిపారు.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల‌నే ల‌క్ష్యంతోనే బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు రూప‌క‌ల్పన చేశామ‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక హాస్టల్ విద్యార్థుల‌కు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామ‌న్నారు. 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్టామ‌ని, ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప్రమోష‌న్లు ఇచ్చామ‌ని సీఎం గుర్తు చేశారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మాదిరే ప్రతి ఏటా 10 నుంచి 15 మంది ఉపాధ్యాయుల‌ను విదేశీ విద్యకు పంపిస్తామ‌ని సీఎం తెలిపారు. అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ విద్యార్థుల‌కు పంచాల‌ని సూచించారు.

ఉపాధ్యాయుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి తాను పాటుప‌డ‌తాన‌ని, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల‌ స‌మ‌స్యలపై త‌న‌తో కొట్లాడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉపాధ్యాయులు ఏ మండ‌లానికి ఆ మండ‌లం యూనిట్‌గా తీసుకొని, వ‌చ్చే విద్యా సంవ‌త్సరానికి అవ‌స‌ర‌మైన ప్రణాళిక రూపొందించాల‌ని సీఎం సూచించారు. ఆ మండలంలోని పాఠ‌శాల‌ల్లో ఏ వ‌స‌తులు కావాలి, ఎంత మంది ఉపాధ్యాయులు కావాలి, మెరుగైన విద్యా బోధ‌న‌కు తీసుకోవాల్సిన చ‌ర్యలు ఏమిటి? ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో పిల్లలు చేరేందుకు ఏం అవ‌స‌ర‌మ‌నే అంశాలు ఆ ప్రణాళిక‌లో ఉండాల‌ని సూచించారు. డిసెంబ‌రు నెలాఖ‌రుకు ఆ ప్రణాళిక త‌మ‌కు అంద‌జేస్తే దానికి అనుగుణంగా తాము కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయా మండ‌లాల‌ నుంచి వ‌చ్చే సూచ‌న‌లు, స‌ల‌హాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చాల‌ని సీఎం సూచించారు.

వ‌చ్చే అయిదేళ్ల వ‌ర‌కు విద్యార్థుల‌కు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు దీక్షబూనాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దాల‌ని, సమాజం కోసం, తరతరాల భవిష్యత్ ను మార్చేందుకు అయిదేళ్ల పాటు పాటుప‌డేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఉపాధ్యాయుల‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దే ల‌క్ష్యంతో ప‌ని చేయాల‌ని కోరారు.

త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉపాధ్యాయుల‌కు మొద‌టి తేదీనే వేత‌నాలు అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామ‌ని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. విద్యపై ఎంత మొత్తమైనా ఖ‌ర్చు చేసేందుకు త‌మ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. మానవ సంబంధాలను మెరుగుప‌ర్చే ప్రయ‌త్నం చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలు మ‌న‌లోని మాన‌సిక ఒత్తిడిని దూరం చేస్తార‌ని అన్నారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అనుబంధాలు ఉన్న స‌మాజం, దేశ‌మే అభివృద్ధి చెందుతుంద‌ని, మాన‌వ సంబంధాలు లేని దేశాలు అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించ‌వ‌ని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు రోజులో అధిక స‌మయం పాఠశాల‌ల్లోనే ఉంటార‌ని, వారికి మాన‌వ సంబంధాల ప్రాధాన్యత‌ను తెలియ‌జేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు.

విద్య నైపుణ్యం కాద‌ని, విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్ ఒక భాష మాత్రమేన‌ని, భాష స‌మాచార మార్పిడికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, నైపుణ్యం జీవ‌నోపాధి క‌ల్పిస్తుంద‌న్నారు. చైనా, జ‌పాన్‌, కొరియా, జ‌ర్మనీ దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు 10 శాతం మించి ఉండ‌ర‌ని, కానీ వారికున్న నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నార‌ని తెలిపారు.

జ‌పాన్‌, జ‌ర్మనీ, కొరియా భాష‌లు కొంత నేర్చుకొని నైపుణ్యాలు నేర్చుకుంటే అక్కడ మంచి ఉపాధి అవ‌కాశాలు పొంద‌వ‌చ్చన్నారు. 12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాల‌ని, ఆ అవగాహ‌న పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల‌పైన ఉంద‌ని అన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు