హైదరాబాద్, ఆగస్టు 28 (జనవాణి): తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన నుంచి బయటపడతామని భావించిన ప్రజలు.. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
శుక్రవారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం అందిస్తున్న ఐదు కిలోల సన్న బియ్యంలోనూ ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఇందిరమ్మ కమిటీలపై తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేటాయించుకుంటున్నారని ఈటల ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఎవరి తాత జాగీరు కాదంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన దానికంటే రూ.100 కోట్లు అదనంగా కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు.
రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు
కేసీఆర్ హయాంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా వ్యవహరించలేదని ఈటల విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ పట్టించుకోలేదని, ఇలాంటి వైఖరి రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రం మద్దతు కోరుతూ.. తెలంగాణకు వచ్చినప్పుడు ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. కేంద్ర సహకారంతోనే తెలంగాణలో రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు.
మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఈటల తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలను కూడా నగర పరిధిలోకి తీసుకొచ్చినా.. వాటి అభివృద్ధిపై ప్రభుత్వం తగినంత దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రైల్వే గేట్ల వద్ద ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని తెలిపారు.
హౌసింగ్ పనులు వేగవంతం చేయాలని సీఎస్‌కు విజ్ఞప్తి
హైదరాబాద్‌లో అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీమ్ పనులను వేగవంతం చేయాలని సీఎస్‌ను కోరినట్లు ఈటల చెప్పారు. రైల్వేలో పెద్ద టెండర్లకే ప్రాధాన్యం ఇస్తూ చిన్న టెండర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనివల్ల అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అమృత్ పథకం కింద కేంద్రం రూ.22 కోట్లు కేటాయిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లకు ఫేస్‌లిఫ్టింగ్ చేపట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. మేడ్చల్, సికింద్రాబాద్ పరిధిలోని పలు రైల్వే గేట్ల వద్ద ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.




















