హైదరాబాద్, సెప్టెంబర్ 03 (జనవాణి): ధరణి పోర్టల్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి విధానంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శామీర్‌పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పేరు మార్చినా కాంగ్రెస్ ప్రభుత్వ విధానం మాత్రం మారలేదని విమర్శించారు. ‘భూభారతి’ పేరుతో ప్రజల ఆస్తులకు ‘భూహారతి’ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
22A జాబితాతో ప్రజలకు ఇబ్బందులు
మల్కాజిగిరి మినీ ఇండియాలాంటిదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. అయితే సెక్షన్ 22A కింద వందలాది కాలనీలను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చారని ఆరోపించారు. పి అండ్ టీ కాలనీ, మహేంద్రహిల్స్ వంటి ప్రాంతాలను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లను విక్రయించలేకపోతున్నారని అన్నారు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు అధికారులదైతే చర్యలు తీసుకోవాలి
22A చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని ఈటల స్పష్టం చేశారు. అయితే పేదల భూములు, ఇళ్లను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తప్పు అధికారులదైతే వారిని సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ నిర్ణయమే కారణమైతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు.
‘తుగ్లక్ పాలన’ అంటూ విమర్శలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని ఈటల వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ.. భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఆయన పాలనను ప్రజలు గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.
ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది భూబాధితులు ఉన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే 22A నిషేధాలపై పునరాలోచించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
భూబాధితులకు మద్దతుగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఎంపీలు, నాయకుల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకే బాధితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈటల పిలుపునిచ్చారు.




















