ఫేక్ ఆధార్, ఓటర్, పాన్‌కార్డులు.. ఆదిలాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

ఆధార్, ఓటర్‌ ఐడీ పాన్‌కార్డులతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆదిలాబాద్‌లో ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

3 ఆగస్టు, 2026 6:59 PM•ByRalin

Share this article

ఫేక్ ఆధార్, ఓటర్, పాన్‌కార్డులు.. ఆదిలాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

Fake Certificates Representative Image

ఆదిలాబాద్, ఆగస్టు 3 (న్యూస్): ఆధార్, ఓటర్‌ ఐడీ పాన్‌కార్డులతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆదిలాబాద్‌లో ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫింగర్‌ప్రింట్ స్కానర్, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల గ్రామపంచాయతీ కార్యదర్శి మహ్మద్ లుక్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు గ్రామపంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపు తయారు చేసి, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలతో పాటు ఇంటి పన్ను ధ్రువపత్రాలు తదితర అధికారిక పత్రాలను కంప్యూటర్ల ద్వారా తయారు చేసినట్లు గుర్తించారు.

ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా ఆధార్‌కు సంబంధించిన పత్రాలు, ఓటర్ గుర్తింపు కార్డులు, పాన్ కార్డులు రూపొందించి అనర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడిని విచారించగా మిగతా నిందితుల పాత్ర వెలుగులోకి వచ్చింది.

నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ సీపీయూలు, మానిటర్లు, ప్రింటర్లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సుప్రీమా రియల్‌స్కాన్–జీ10 ఫింగర్‌ప్రింట్ స్కానర్, సీఎంఐ టెక్ కెమెరా, లాజిటెక్ వెబ్ కెమెరాతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ రబ్బర్ స్టాంపులు, నకిలీ ఓటర్ ఐడీ కార్డులు, జనన ధ్రువపత్రాలు, ఇతర నకిలీ సర్టిఫికెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి డిజిటల్ ఆధారాలను సేకరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది పేర్లతో నకిలీ పత్రాలు రూపొందించారు? వాటిని ఎవరెవరు వినియోగించారు? ఈ ముఠాతో మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

అరెస్టయిన నిందితులు

షేక్ హరూన్ (26), కేశవపట్నం, ఇచ్చోడ మండలం.

అబ్దుల్ షఫీక్ (31), ఇస్లాంపురా కాలనీ, ఇచ్చోడ.

షేక్ దిల్‌షాద్ అహ్మద్ (19), ఇస్లాంపురా కాలనీ, ఇచ్చోడ.

అబ్దుల్ రహమాన్ ఖాన్ (20), హనుమాన్ కాలనీ, ఇచ్చోడ.

సయ్యద్ నౌషాద్ (26), ఇస్లాంపూర్ గ్రామం, ఇచ్చోడ మండలం.

అబ్రార్ అలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పలు చట్టాల కింద కేసు

నిందితులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 338, 340, 341(2) రీడ్ విత్ 3(5), ఐటీ చట్టం సెక్షన్ 66-డి, ఆధార్ చట్టం-2016 సెక్షన్ 35 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు