కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!

కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

5 అక్టోబర్, 2026 5:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!

హైదరాబాద్, అక్టోబర్ 5 జనవాణి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ పలు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో రూ.1,000 కోట్లతో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో హోటల్ నిర్మించారంటూ గజ్జెల కాంతం ఆరోపించారు. అలాగే కోహినూర్ హోటల్‌లో బెదిరించి 25 శాతం వాటా తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు అవాస్తవమైతే కేటీఆర్ ఆధారాలతో ఖండించాలని సవాల్ చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డికి మెడికోవర్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. మెడికోవర్ ప్రారంభోత్సవానికి మాత్రమే రేవంత్‌రెడ్డి వెళ్లారని తెలిపారు. సంస్థ ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణతో పాటు 42 మంది డైరెక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు. కేటీఆర్ హయాంలోనే ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు.

యశోద భూములపై విచారణ జరుగుతోందని వెల్లడి

యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపుపైనా గజ్జెల కాంతం పలు ఆరోపణలు చేశారు. 2015 జూన్ 16న జారీ చేసిన జీవో 82, సర్వే నంబర్ 41/14, అదే ఏడాది అక్టోబర్ 7న జారీ చేసిన జీవో 191 ద్వారా భూమి కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్‌కు 2014కు ముందు పెద్దగా ఆస్తులు లేవని, ఆ తర్వాత వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని గజ్జెల కాంతం ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల కేటాయింపులు, ఇతర వ్యాపార వ్యవహారాలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలి

మైండ్ వాల్ట్ కార్పొరేట్ స్కూల్ రేవంత్‌రెడ్డి కుమార్తెకు చెందినదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గజ్జెల కాంతం మండిపడ్డారు. హైదరాబాద్‌లో అలాంటి సంస్థ లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి సతీమణి కుటుంబం గతంలోనే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమని, అప్పటికి రేవంత్‌రెడ్డి మంత్రి లేదా ముఖ్యమంత్రి కాదని తెలిపారు. మాక్స్‌బిన్ ఫార్మా, స్వచ్ బయో వంటి సంస్థలపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. ఆయా సంస్థల ఏర్పాటుకు, సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేటీఆర్‌కు సంబంధించిన వ్యవహారాలపై విచారణలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై నిజమైన ఆధారాలు ఉంటే వాటిని బహిర్గతం చేయాలని గజ్జెల కాంతం సవాల్ చేశారు. కేవలం ఆరోపణలు, రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. కేటీఆర్ చెంచాగాళ్లతో ప్రెస్‌మీట్లు పెట్టించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరని గజ్జెల కాంతం వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు