కారులో మంటలు.. కొడుకు కళ్ల ముందే తండ్రి సజీవ దహనం

గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ కోసం కొడుకుతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వెనుక సీటులో ఉన్న హరికృష్ణ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. కారు నడుపుతున్న ఆయన కుమారుడు అఖిలేష్ స్థానికుల సాయంతో బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

29 సెప్టెంబర్, 2026 5:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కారులో మంటలు.. కొడుకు కళ్ల ముందే తండ్రి సజీవ దహనం

గుంటూరు,సెప్టెంబర్ 29 (జనవాణి): గుంటూరు ఐపిడి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెనుక సీటులో ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మృతుడిని ఐపిడి కాలనీకి చెందిన 55 ఏళ్ల హరికృష్ణగా గుర్తించారు. ఆయన కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు.

హరికృష్ణ గతంలో కాటన్ బయ్యర్‌గా పనిచేశారు. వ్యాధి ముదరడంతో కొంతకాలంగా డయాలసిస్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్నారు. తండ్రిని చూసుకునేందుకు ఆయన కుమారుడు అఖిలేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని మానేసి తండ్రి వద్దే ఉంటున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో డయాలసిస్ కోసం తండ్రీకొడుకులు కారులో ప్రైవేట్ ఆసుపత్రికి బయలుదేరారు. అఖిలేష్ కారు నడుపుతుండగా హరికృష్ణ వెనుక సీటులో కూర్చున్నారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యుడు అందుబాటులో లేరని తెలియడంతో ఇద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరారు.

అపార్ట్‌మెంట్‌కు సమీపంలోకి చేరుకోగానే కారులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. దీంతో అఖిలేష్ వెంటనే కారును నిలిపివేశాడు. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో కారు డోర్లు కూడా లాక్ అయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అఖిలేష్ వైపు ఉన్న కారు అద్దాన్ని పగులగొట్టి డోర్ తెరిచి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మంటలు అంటుకోవడంతో అఖిలేష్ స్వల్పంగా గాయపడ్డాడు.

అయితే వెనుక సీటులో ఉన్న హరికృష్ణను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించేలోపే మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో ఆయనను బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చే సమయానికి హరికృష్ణ మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. డీజిల్ కారులో ఏసీకి సంబంధించిన సమస్య కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు