హైదరాబాద్, ఆగస్టు 2: మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి తన ఉదారతను చూపించారు. తండ్రిని కోల్పోయి ఆర్థిక భారంతో చదువు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థిని అఖిలకు అండగా నిలిచారు. నీట్ పరీక్ష రాసిన అఖిలను తన నివాసానికి ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. తన చదువుకు అవసరమైన డబ్బును తానే అందజేస్తానని హామీ ఇచ్చారు.
నాలుగేళ్ల క్రితం తండ్రిని కోల్పోయి చదువు కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థినికి హరీశ్‌రావు అప్పుడే అండగా నిలిచారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు మెరిడియన్ విద్యాసంస్థల్లో చదివించారు. అక్కడే ఇంటర్ పూర్తి చేసిన అఖిల ఇటీవల నీట్ పరీక్ష రాసింది. దీంతో వైద్య విద్యలో కూడా ఆమెకు అండగా ఉంటానని హరీశ్ రావు ఇచ్చారు.
అఖిలకు ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా ఫీజు మొత్తాన్ని తానే భరిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని సూచిస్తూ మనో ధైర్యంనింపారు. ఈ సందర్భంగా మెరిడియన్ విద్యాసంస్థల యాజమాన్యం కూడా అఖిలకు అందించిన సహకారానికి హరీశ్‌రావు అభినందించారు. సామాజిక బాధ్యతతో విద్యార్థిని చదువుకు తోడ్పడిన వారిని ప్రశంసించారు.





















