హైదరాబాద్, ఆగస్టు 08 (జనవాణి): బోనాల పండుగ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లాల్ దర్వాజా, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, దర్బార్ మైసమ్మ, కార్వాన్ బోనాల సందర్భంగా ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
లాల్ దర్వాజా బోనాలకు ప్రత్యేక ఆంక్షలు
హైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు, అలాగే సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఇంజిన్ బౌలి, ఫలక్‌నుమా నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్ ‘T’ జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బన్ లేదా గోశాల-మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లించనున్నారు. మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్‌బన్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. నాగుల్ చింతా, సుధా టాకీస్ నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపురా మీదుగా అనుమతిస్తారు. గౌలీపురా నుంచి లాల్ దర్వాజా వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి, మీర్‌చౌక్ వైపు అనుమతిస్తారు. చార్మినార్ నుంచి నాగుల్ చింతా వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ వైపు పంపనున్నారు.
భారీ వాహనాలకు ఆంక్షలు
రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను వెంకటేశ్వరస్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లిస్తారు. కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలను OP ఛత్రినాక పోలీస్ స్టేషన్ ‘Y’ జంక్షన్ వద్ద గౌలీపురా వైపు మళ్లించనున్నారు.
బాలా గంజ్ నుంచి వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ, నాగుల్ చింతా జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి గౌలీపురా మీదుగా వచ్చే వాహనాలను బాలరాజ్ జ్యువెలర్స్ గౌలీపురా ఎక్స్‌రోడ్స్ వద్ద మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. పాత చంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక వైపు వచ్చే భారీ వాహనాలను సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణా, ఆంద్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులను చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. వీటిని పాత సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్స్, ఛత్రినాక, ఇంజిన్ బౌలి వద్ద నిలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
అంబర్‌పేట్‌లోనూ ట్రాఫిక్ మళ్లింపులు
అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉప్పల్ నుంచి చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపు వెళ్లే జిల్లా, సిటీ బస్సులు, ఇతర వాహనాలను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ నుంచి వచ్చే జిల్లా, సిటీ బస్సులు, భారీ వాహనాలను కూడా అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా పంపనున్నారు.
మరోవైపు రామంతాపూర్ వైపు నుంచి ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద ఎడమ బైలేన్ ద్వారా గాంధీ విగ్రహం వైపు వెళ్లి, అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో వాహనాలను పార్క్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
రామంతాపూర్ నుంచి ఆలీ కేఫ్, రోడ్ నంబర్ 6 వైపు వెళ్లే వాహనాలను సల్దానా గేట్ వైపు మళ్లించనున్నారు. తిలక్‌నగర్, ఎన్‌సీసీ నుంచి రామంతాపూర్, ఉప్పల్ వైపు వెళ్లే ఆర్టీసీ, సిటీ బస్సులు, భారీ వాహనాలను రోడ్ నంబర్ 6 జంక్షన్ వద్ద గోల్నాక వైపు మళ్లించి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించనున్నారు.
బోనాల వేడుకలకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Loading Tweet...




















