ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలకు ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని పేర్కొన్న ఆయన... నగరవ్యాప్తంగా జరుగుతున్న బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి బోనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని వివరించారు.

భక్తుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్న సీపీ... బోనాల కోసం సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.




















