హైదరాబాద్, ఆగస్టు 22 (జనవాణి): హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. హైడ్రా సిబ్బంది ఒక మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికితీశారు. మృతిచెందినవారు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఉమేష్ (34), మహేష్ (42) గుర్తించారు. టైల్స్ కార్మికులుగా పని చేస్తూ కొండాపూర్‌లో ఉంటున్నారు.
ప్రమాదం జరిగిన భవనం బయట ఖాళీ స్థలం ఉంది. సాయంత్రం అయ్యేసరికి చిన్నారులు అక్కడే రకరకాల ఆటలు ఆడుతుంటారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తగ్గిందని, అదే సాయంత్రం వేళ జరిగితే ఎక్కువగా ఉండేదని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ వాసులు బెంబేలెత్తుతున్నారు.
ఏడంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని హాస్టల్‌లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకుని సుమారు 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. హాస్టల్ కోసం భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో లోపల ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




















