భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

25 సెప్టెంబర్, 2026 9:52 AM•ByNarender Kumar Nangunoori

Share this article

భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రతతో పాటు రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా.. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో, ఆర్టీసీ సేవలను విస్తరించారు.

మెట్రో సేవలు పొడిగింపు

నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను పొడిగించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. దీంతో నిమజ్జన వేడుకలు ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కలగనుంది.

24 గంటలు 700 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ 700 ప్రత్యేక బస్సులను 24 గంటల పాటు నిరంతరాయంగా నడుపుతోంది. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఈ బస్సులను అందుబాటులో ఉంచారు.

44 ప్రాంతాల్లో ఆర్టీసీ కంట్రోలర్లు

రవాణా నిర్వహణను పర్యవేక్షించేందుకు నగరంలోని 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ కంట్రోలర్లను నియమించారు. బస్సుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు 87 మంది మెకానిక్‌లు, 113 మంది డ్రైవర్లను అందుబాటులో ఉంచారు. అలాగే మూడు ప్రాంతాల్లో ప్రత్యేక రిలీఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు.

ఇతర రాష్ట్రాల బస్సులకు రూట్ల మార్పు

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ, కేఎస్‌ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు, ప్రజలు అధికారులు కల్పించిన మెట్రో, ఆర్టీసీ రవాణా సదుపాయాలను వినియోగించుకుని గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు