హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 10తో ముగియగా... దానిని ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకాన్ని చేపట్టింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చి, నామమాత్రపు ధరలోనే పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పథకం కింద హైదరాబాద్‌లో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ తదితర వరుస సెలవుల నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.
46,121 దరఖాస్తులు
ఆగస్టు 10 సాయంత్రం వరకు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకానికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. గడువు పొడిగించినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, ఇళ్ల కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెలాఖరులోగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తుల వివరాలు...
అంబర్‌పేట – 3,073
బహదూర్‌పురా – 1,706
ఇబ్రహీంపట్నం – 1,031
కార్వాన్ – 2,184
ఖైరతాబాద్ – 5,518
కూకట్‌పల్లి – 6,615
మహేశ్వరం – 734
మలక్‌పేట – 3,609
మల్కాజ్‌గిరి – 1,333
మేడ్చల్ – 1,668
నాంపల్లి – 4,372
కుత్బుల్లాపూర్ – 5,571
రాజేంద్రనగర్ – 2,060
సనత్‌నగర్ – 1,404
సికింద్రాబాద్ (కంటోన్మెంట్) – 1,755
శేరిలింగంపల్లి – 3,488




















