హైదరాబాద్, అక్టోబర్ 2 (జనవాణి): హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మెట్రో, ఆర్టీసీ సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కతో పాటు ముఖ్యమంత్రి, 15 మంది మంత్రుల కోసం వన్ డే ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఈ కామన్ పాస్‌తో మెట్రోలో ప్రయాణించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
డే, వీక్లీ, మంత్లీ పాస్‌లు
కొత్త విధానంలో డైలీ, నెలవారీ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. సమాచారం ప్రకారం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. నగర పరిధిలోని ఆర్టీసీ, మెట్రో సేవలను ఉపయోగించే ప్రయాణికులకు ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ పరిధిలో ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ బస్సులకు ఈ పాస్ వర్తించనుంది. మెట్రో రైళ్లలోనూ ప్రయాణించే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు
హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. నగరాన్ని ప్రపంచస్థాయి, మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు రూ.52 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. మెట్రో ఫేజ్-2లో రూ.38 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 366 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్, 21 రేడియల్ రోడ్ల అభివృద్ధితో పాటు మూసీ పునర్నిర్మాణం, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచడంతో పాటు ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్, హిల్ట్ పాలసీ వంటి చర్యలను కూడా తీసుకొస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్రజా రవాణా బలోపేతమే లక్ష్యం
ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందిస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమైతే నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేస్తూ ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమంపై దృష్టి
ఆటో డ్రైవర్లు కూడా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములని పొన్నం ప్రభాకర్ అన్నారు. వారి సమస్యలు, జీవనోపాధి, సంక్షేమాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీల అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ప్రజలపై అదనపు భారం పడకుండా, ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ దిశగా..
విజన్–2047లో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో తదితర రవాణా సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Loading Tweet...




















