ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శుక్రవారం శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏడాది బోనాల సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి.
120 ఏళ్ల సంప్రదాయం
ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనర్.. లాల్‌దర్వాజా మహంకాళి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు.
అన్ని శాఖలతో సమన్వయం
గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్న సీపీ, లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే తరహాలో విజయవంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
2 వేల మంది పోలీసులతో భద్రత
బోనాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ తెలిపారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో కలిపి సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు చెప్పారు.
ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌పై ప్రత్యేక నిఘా
బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సజ్జనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబుదొంగతనాలు వంటి ఘటనలు జరగకుండా క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ సజ్జనర్ కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (సౌత్ రేంజ్) తఫ్షీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




















