పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా

హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫ్లాట్‌ పొందిన వారికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని, పదేళ్ల తర్వాత అవసరమైతే ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

28 ఆగస్టు, 2026 5:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా

హైదరాబాద్, ఆగస్టు 28 (జనవాణి): పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభించారు. నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

అర్హతే ప్రామాణికం

ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, రాజకీయాలకు తావు లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హతే ప్రామాణికంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. మీడియా, లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించడంతో పాటు ప్రక్రియను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన చేపడతారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలో అర్హులకు అవకాశం కల్పిస్తామని మంత్రి వివరించారు.

సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తులు

మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తయిందని మంత్రి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 16 నియోజకవర్గాల్లో రికార్డు సమయంలో టెండర్లు పిలవడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టడం ప్రభుత్వానికి విజయమని అన్నారు.

రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌

ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ పత్రాలను బ్యాంకులో కుదువ పెట్టి రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మించి అందిస్తామని తెలిపారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి ఉంటుందని చెప్పారు. అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు టవర్స్‌ నిర్మించి, లిఫ్ట్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వివరించారు.

లక్కీడ్రా తర్వాత తుది ఎంపిక

లక్కీడ్రా పూర్తయిన తర్వాత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, సర్టిఫికెట్ల జారీ ద్వారా లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆ తర్వాత 3–4 రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యం

ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయని వెల్లడించారు. మొత్తం ఫ్లాట్లలో 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నాలుగు విడతల్లో అందిస్తున్నామని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలు ఖరీదైన ప్రాంతాల్లోనూ గౌరవంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు