జగిత్యాల,సెప్టెంబర్ 25 (జనవాణి): జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ నిమజ్జన కేంద్రాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా ట్రాన్స్‌జెండర్లను నిమజ్జన బందోబస్తు విధుల్లో భాగస్వాములను చేశారు. మొత్తం 17 మంది ట్రాన్స్‌జెండర్లు పోలీసులతో కలిసి భద్రతా విధుల్లో పాల్గొన్నారు. జనసందోహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించారు.
గతేడాది నిమజ్జన బందోబస్తులోనూ ట్రాన్స్‌జెండర్లు అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి సేవలు నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. గతేడాది వారి సేవలకు ప్రశంసలు కూడా లభించాయని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి భద్రతా విధుల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ట్రాన్స్‌జెండర్ సిబ్బంది జగిత్యాల జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ తమకు అప్పగించిన బాధ్యత తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాల్లో మరింత నిబద్ధతతో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.




















