హైదరాబాద్ (తెలంగాణ), జూలై 22: జీహెచ్‌ఎంసీ కోర్ అర్బన్ రీజియన్ సమీకృత పాలనా బిల్లు (CURE Bill)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో.. ఈ బిల్లు వల్ల స్థానిక సంస్థల అధికారాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, పన్నులు, పౌర సేవలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పేర్కొంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా బిల్లుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేసి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరింది.
హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధి జనసేన ముఖ్య లక్ష్యమని, నగర పాలనను సులభతరం చేసే సంస్కరణలను పార్టీ సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపింది. అయితే కొత్త చట్టాల పేరుతో ప్రజల హక్కులకు భంగం కలగకూడదని, చట్టం ప్రజల్లో భరోసా కలిగించేలా ఉండాలని పేర్కొంది.
'క్యూర్ బిల్లు'లోని ప్రతి నిబంధనను ప్రజల ముందుంచి విస్తృత చర్చ జరపాలని, సమగ్ర పాలనా బిల్లుపై పూర్తి స్పష్టత ఇవ్వాలని జనసేన కోరింది. నగరాభివృద్ధి కేవలం కొత్త చట్టాలతో సాధ్యం కాదని, ప్రజలతో సంప్రదింపులు, మెరుగైన పౌర సేవలు, పారదర్శక నిర్ణయాలు, అవినీతి రహిత పాలన, బాధ్యతాయుతమైన జవాబుదారీతనం ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది.




















