హైదరాబాద్, సెప్టెంబర్ 03 (జనవాణి): మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించనున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ తన పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ మహిళగా ఆమెకు రాజకీయంగా మరింత ఉన్నత స్థానం దక్కాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పదవులకు ఇబ్బంది ఉండదని, బీసీ నాయకుల పదవులకే ప్రమాదం ఉంటుందని కేఏ పాల్ ఆరోపించారు. బీసీలు, కాపులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఆమె చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. మహిళ, బీసీ నాయకురాలు కావడంతోనే కొండా సురేఖకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
ప్రజాశాంతి పార్టీతోనే అభివృద్ధి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అప్పులు తీర్చాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలని కేఏ పాల్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం రావాలని, అంబేద్కర్, గద్దర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజలకు శాంతి, రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను పనిచేస్తానని కేఏ పాల్ తెలిపారు.
Loading Tweet...




















