హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీఆర్‌ఎస్ చీఫ్ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నష్టానికి కేసీఆర్ వ్యవహారశైలే కారణమన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. పార్టీ వైఫల్యాలను కేసీఆర్‌పై నెట్టడం మీ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని, ఇతర నాయకులు జోక్యం చేసుకోవద్దని కేసీఆర్ చెప్పడం వల్లే పార్టీ నష్టపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కవిత అన్నారు. పార్టీ అధినేతను బహిరంగంగా విమర్శించడం, ఆయన విధానపరమైన నిర్ణయాలను తప్పుపట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ మూడేళ్లుగా బయటకు రాకపోయినా ప్రజల్లో ఆయనపై అభిమానం తగ్గలేదని కవిత పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతోందా అంటూ కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. తాను పార్టీలోని ఓ నాయకుడిని విమర్శించినందుకే కొన్ని గంటల్లో తనను సస్పెండ్ చేశారని కవిత ఆరోపించారు. అదే సమయంలో ఆ నాయకుడితో అంటకాగుతున్నారని కేటీఆర్‌ను విమర్శించారు. ఫామ్‌హౌస్‌లు, అనుమతులు, రాజకీయ వ్యవహారాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలను ప్రస్తావిస్తూ పార్టీని పాతాళంలోకి నెట్టింది ఎవరో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ సమావేశంలో రైతు ఫోన్ మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను, ఓ మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలను కూడా కవిత ప్రస్తావించారు. పార్టీపై ప్రజల్లో ప్రతికూలతకు ఇలాంటి వ్యవహారశైలే కారణమని ఆమె ఆరోపించారు.
‘బీఆర్‌ఎస్‌కు గోతిని తవ్వుతున్నావ్’
గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి కేసీఆర్‌నే తప్పుపడుతున్నారని కవిత విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు మీరే గోతిని తవ్వుతున్నారని, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీలోని వైఫల్యాలు, చేతగానితనాన్ని బీఆర్‌ఎస్ అధినేతపై మోపడం సరికాదని వ్యాఖ్యానించారు.
గణేష్ నిమజ్జనోత్సవంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను బతిమాలి కేసీఆర్ పాటలు పెట్టించుకున్నారని కవిత ఆరోపించారు. తాను ఎవరి మాటలు విని మాట్లాడనని, నిర్దిష్ట ఆధారాలతోనే మాట్లాడుతానని పేర్కొన్నారు. ‘నాతో పెట్టుకోకు’ అంటూ కేటీఆర్‌కు హెచ్చరిక జారీ చేశారు.
Loading Tweet...




















