హైదరాబాద్, అక్టోబర్ 5 జనవాణి): హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానం మంచి ఫలితాలు ఇస్తుండటంతో ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన ట్రాఫిక్ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేయనుంది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఫ్లైఓవర్ నిర్మించేలా ప్రణాళికను మార్చారు. మరోవైపు నాగార్జున సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వైపు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు.
రూ.400 కోట్లు ఆదా
కొత్త ప్రణాళికతో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల మేర వ్యయం తగ్గనుంది. అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేలా ప్రాజెక్టును పునఃప్రణాళిక చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. కొన్ని కోర్టు కేసుల కారణంగా కూడా ప్రాజెక్టు ప్రణాళికలో మార్పులు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ తగ్గించడమే లక్ష్యం
కేబీఆర్ పార్క్ చుట్టూ సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న విధానాన్నే శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్‌ను శాశ్వతంగా తగ్గించడంతో పాటు.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.




















