గజ్వేల్,సెప్టెంబర్ 8 (జనవాణి): గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రయత్నించాయి. డప్పు చప్పుళ్లతో ఫాంహౌస్ వైపు కదిలిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద వెయ్యి డప్పులతో చావు డప్పు కొడతామంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫాంహౌస్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ఫాంహౌస్ వైపు వస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు.
ఫాంహౌస్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
మరోవైపు కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఫాంహౌస్ వైపు పయనమయ్యారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఫాంహౌస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే బొల్లారం చౌరస్తా వద్ద పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా ఇంటికి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు, మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రవెల్లి ఫాంహౌస్ వైపు కదలడంతో అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు.




















