ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌లో టికెట్‌ ఫైట్‌.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్‌ కోసం పోటీ తీవ్రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, రోహిన్‌ రెడ్డి, విజయారెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీజేఆర్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

1 అక్టోబర్, 2026 3:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌లో టికెట్‌ ఫైట్‌.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ముందే కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ పోరు ముదిరింది. పార్టీ టికెట్‌ దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, రోహిన్‌ రెడ్డి, విజయారెడ్డి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో పీజేఆర్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే.. దానం నాగేందర్‌ ఎంపీ అభ్యర్థి” అని పేర్కొన్నారు. పీజేఆర్‌ పేరులేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌లో ముందుకు వెళ్లదని ఆమె అన్నారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాల్లోకి పంపి, తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పీజేఆర్‌ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని విజయారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఇటీవల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు