హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని ఆరోపించారు. రజాకార్ల దాష్టీకానికి సంబంధించిన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు. చరిత్రను ఎవరూ దాచిపెట్టలేరని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మజ్లిస్‌కు భయపడి తెలంగాణ చరిత్రను ప్రజలకు పూర్తిగా తెలియకుండా చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిజాం పాలకులను ప్రశంసించారని పేర్కొంటూ, ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
‘నిజాం మంచివాడైతే ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? ప్రజలు ఎందుకు పోరాటాలు చేయాల్సి వచ్చింది? నిజాం మంచివాడైతే ఆపరేషన్ పోలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది?’ అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
నిజాం మంచివాడని కొందరు పొగుడుతున్నారు: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తెలంగాణ చరిత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం మంచివాడని కొందరు పొగుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం పాలన మంచిదే అయితే ప్రజలు నాడు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల చరిత్రను మరుగున పడేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశాయని విమర్శించారు.
కాగా, కేంద్ర హోంశాఖ 2024లో సెప్టెంబర్ 17ను ప్రతి ఏడాది ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకోవడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని కేంద్రం పేర్కొంది.




















