ఢిల్లీ, అక్టోబర్ 1 (జనవాణి): ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియాగాంధీ కుటుంబం మెప్పు కోసమే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ కుటుంబం కోసం ప్రాణత్యాగం చేస్తానంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ అవసరాల్లో భాగమేనని విమర్శించారు. ఢిల్లీలో రాముడు వేరు.. శివుడు వేరు అన్నట్టుగా మాట్లాడటం సరికాదని అన్నారు.
హిందూ సమాజంలో ప్రజలు వివిధ దేవుళ్లను ఆరాధిస్తారని, దేవుళ్ల విషయంలో విభజనకు తావు ఇవ్వకూడదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మతాలు, దేవుళ్ల అంశాలను రాజకీయ చర్చలోకి తీసుకురావడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించినట్టే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా రాజకీయ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేస్తున్నారని, కులాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.




















