వరంగల్,సెప్టెంబర్ 13 (జనవాణి): కాంగ్రెస్ నేత కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన భార్య, మంత్రి కొండా సురేఖ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి పలువురు ఫోన్లు చేసినా సురేఖమ్మ ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు.
పదవులు ఉంటాయి.. పోతాయి
ఢిల్లీకి రావాలని ఫోన్ వచ్చిన విషయం నిజమేనని కొండా మురళి చెప్పారు. అయితే ఒక మాటపై నిలబడి ప్రజలకు సేవ చేయాలని సురేఖ నిర్ణయించుకున్నారని తెలిపారు. పదవి ఉంటే ఉంటుందని, పోతే పోతుందని.. కానీ ‘సారీ’ అని ఏ రోజు రాయబోమని స్పష్టం చేశారు. అధిష్టానం సురేఖను క్షమాపణ కోరుతూ పేపర్‌పై రాయమన్నా ఆమె రాయలేదన్నారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకులు లేరని, ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని కొండా మురళి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని పేర్కొన్నారు. కృతజ్ఞత అనేది తమ రక్తంలోనే ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి వెన్నుపోటు పొడవకుండా కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
‘కొండా మురళి మాటంటే మాటే’
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కూడా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పులో 24 మంది కార్పొరేటర్లను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే, గెలిచే సత్తా ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్లు దక్కుతాయని తెలిపారు. వరంగల్ తూర్పు బాధ్యతలను నవీన్ రాజ్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. తనపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు. తనకు, తన కుమార్తె సుస్మితకు రాజకీయంగా సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘కార్యకర్తలే నా బలం’
తనపై నమ్మకం పెట్టుకున్న ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారని కొండా మురళి అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. కార్యకర్తల కోసం అవసరమైతే మరో 10 ఎకరాల భూమినైనా అమ్ముతానని చెప్పారు. తన శరీరంలో ఇప్పటికీ నాలుగు బుల్లెట్లు ఉన్నాయని, కార్యకర్తల ఆశీస్సులే తనను బతికిస్తున్నాయని కొండా మురళి పేర్కొన్నారు. ఎన్ని రోజులు బతికామన్నది కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Loading Tweet...




















