హైదరాబాద్సె,ప్టెంబర్ 03 (జనవాణి): తెలంగాణ కేబినెట్ నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బర్తరఫ్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదని, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ రాజకీయాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
తనను తొలగించే ముందు కనీసం వివరణ కూడా తీసుకోలేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చానని, మంత్రిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనతో మాట్లాడకుండా బర్తరఫ్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
బర్తరఫ్ సర్క్యులర్‌పై ప్రశ్నలు
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న బర్తరఫ్ సర్క్యులర్‌పై కూడా కొండా సురేఖ ప్రశ్నలు లేవనెత్తారు. ఆ పత్రంపై సీఎం రేవంత్ రెడ్డి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకాలు లేవని, ఆమోదముద్ర లేని పత్రానికి చెల్లుబాటు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన బర్తరఫ్ నిర్ణయం చెల్లదని ఆమె వ్యాఖ్యానించారు.
కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దు
తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కొండా సురేఖ అన్నారు. సుస్మిత స్వతంత్ర మహిళ అని, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. రాజకీయ అవకాశాల కోసం సుస్మిత చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని, కుటుంబానికి రాజకీయ పదవులు దక్కకపోవడంపై ఆమెకు బాధ ఉందని పేర్కొన్నారు. ఇతర రాజకీయ కుటుంబాలను ప్రస్తావిస్తూ కూడా కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. కడియం శ్రీహరి తన కుమార్తెకు రాజకీయ అవకాశం కల్పించలేదా? ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉన్న సమయంలో ఆయన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో లేరా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలపై కూడా ప్రశ్నలు
తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ.. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే తన కోసం డాక్టర్ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.
తదుపరి రాజకీయ అడుగుపై నిర్ణయం లేదు
ప్రస్తుతం తన తదుపరి రాజకీయ అడుగుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొండా సురేఖ తెలిపారు. భర్త కొండా మురళి, అభిమానులతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు.




















