హైదరాబాద్, ఆగస్టు 28 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా తీవ్ర చర్చకు దారితీసిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రక్షాబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
పరకాల వ్యవహారంతో మొదలైన వివాదం
పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం కొండా కుటుంబం, సీఎం రేవంత్ రెడ్డి మధ్య విభేదాలకు కారణమైంది. పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరును ప్రకటించడంపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది. సీఎంను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కోరడంతో పాటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా అంశాన్ని పరిశీలించింది.
వేటు ప్రచారం.. రాజీనామా పుకార్లు
ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. మరోవైపు కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారనే పుకార్లు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. కొండా సురేఖ స్వయంగా రాజీనామా చేయవచ్చనే ప్రచారం సైతం సాగింది. అయితే ఈ ఊహాగానాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా సురేఖ వెళ్లి రాఖీ కట్టడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది.
రేవంత్-కొండా సురేఖ ముఖాల్లో చిరునవ్వులు
పరకాల వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మధ్య దూరం పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే రక్షాబంధన్ సందర్భంగా జరిగిన భేటీలో ఇరువురి ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఇక ఎండ్ కార్డు పడినట్లేనా? పార్టీ అధిష్టానం, సీఎం స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించిందా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. అయితే తాజా పరిణామంపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.




















