కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆమె వివరణపై కమిటీ సంతృప్తి చెందలేదని, సురేఖతో పాటు మరో ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌కు అందించనున్నారు.

24 ఆగస్టు, 2026 12:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ

హైదరాబాద్, ఆగస్టు 24 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆమెపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కమిటీ అందించనుంది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపైనా కఠిన నిర్ణయం తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఈ నివేదికను మహేశ్ గౌడ్ ఏఐసీసీకి పంపనున్నట్లు సమాచారం.

సురేఖ వివరణపై అసంతృప్తి

కొండా సురేఖ ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత ఆరోపణలు చేసిన సందర్భంలో.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి సురేఖ వాటిని ఖండించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కొండా సురేఖను తాను కాపాడానని, ఇక ఈ విషయంలో తానేమీ చేయలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్‌తో భట్టి భేటీ

మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఇటీవల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు