హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రజా భవన్‌లోని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో నిర్వహించిన వేడుకల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరనృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులతో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, గ్రామదేవతల పట్ల ఉన్న భక్తికి బోనాల పండుగ గొప్ప నిదర్శనమని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం సమాజంలో ఐక్యతను, పరస్పర సహకారాన్ని, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఆషాఢ బోనాల ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా, వైభవంగా కొనసాగుతున్నాయని పేర్కొన్న మంత్రి, ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు కృషి చేస్తున్న అధికారులు, దేవాలయ కమిటీలు, భక్తులకు అభినందనలు తెలిపారు.




















