పరకాల, ఆగస్టు 19 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సీఎం రేవంత్‌రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే’ అంటూ కొండా టీమ్‌కు సంబంధించిన పోస్టును షేర్ చేశారు. ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్నే భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సుస్మిత చేసిన పోస్ట్‌కు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. పరకాల సీటుపై కొండా కుటుంబం ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ఈ పోస్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు కౌంటర్‌గా పెట్టారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ పోస్టుపై కొండా కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు.
పరకాలతో కొండా కుటుంబానికి గతంలోనే రాజకీయ అనుబంధం ఉంది. కొండా సురేఖ గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో కొండా సుస్మితను పరకాల నుంచి బరిలోకి దింపి రాజకీయ అరంగేట్రం చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా సుస్మిత ఇన్‌స్టా స్టోరీతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాల నియోజకవర్గంలో కొండా వర్గం పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సుస్మిత రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా కీలక ప్రకటన వెలువడుతుందా అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
ప్రస్తుతం రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ఉండగా.. కొండా కుటుంబం పరకాలపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోనే ఉండనుంది.





















